Sri Bhagavadgeetha Madanam-1    Chapters   

4. భాగవతము భగవద్గీతల యందలి

కర్మ భక్తి ధ్యాన జ్ఞాన యోగముల సమన్వయము

సమన్వయ వేదాంతము

(Synthetic Philosophy)

ముక్తిదాయకములగు యోగములు :-

కర్మయోగము, భక్తియోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము అను ఈ నాలుగు యోగములు ముక్తికి సాధనములని వేదములు ఉపనిషత్తులు, పురాణములు, దర్శనములు మొదలగు వానియందు చెప్పబడియున్నది. కాని ఒక్కొక్కటి ఒక్కొక్కయోగమునే సర్వోత్కృష్టమని సమర్థించి, మిగిలిన యోగములను గౌణములుగను సహాయకారులుగను పరిగణించుచున్నది. అట్లుగాక భగవద్గీత భాగవతములు ఈ నాలుగు యోగములను తగినట్లు సవరించి సమన్వయ మొనర్చి అన్ని యోగములు ముక్తిని బొందుటకు సమాన యోగ్యత గల సాధనములని నిరూపించుటయేగాక ఆ నాలుగు యోగములపై తమ ఆమోదముద్రను వైచినవి.

ఇట్టి యోగ సమస్వయదృష్ఠియే భగవద్గీత భాగవతములయొక్క విశిష్టతయిని చెప్పవచ్చు. అందులకే Sri Ram Narayan Vyas M.A., Ph.D., D.Litt., LLB., సాహిత్యరత్నగారు భాగవతవేదాంతమును 'The Synthetic Philosophy of Bhagavathaఅన్నారు.

నాలుగు యోగముల ఆవశ్యకత:

భాగవతము భగవద్గీతపై నాలుగుయోగములు మోక్షదాయకములని ఎట్లు నిరూపించినవో పరిశీలింతము. వేదములలో కర్మమార్గము జ్ఞానమార్గము-రెండును చెప్పబడినవి. ఒకమార్గము చాలదా? యని ప్రశ్నించవచ్చును. కొందరుకు జ్ఞాననిష్ఠకుదురును, కొందరుకు ప్రేమపూరిత భక్తి యలవడును. కొందరకు కర్మయం దాసక్తి కలుగును. కావున అందరకు వారివారి ప్రవృత్తి లేదా అభిరుచికి తగినట్లు మార్గములు సూచించబడెనని అనుభూతి ప్రకాశికలో విద్యారణ్యులు తెలిపిరి.

శ్లో || యోగో వివేక ఇత్యుక్తౌ ప్రకారౌ శ్రుతి సమ్మతౌ

ఆసాధ్యః కస్యచి ద్యోగః కస్యచి జ్ఞాన నిశ్చయః 54

శ్లో || ప్రకారౌద్వౌ తతః ప్రోక్తౌసర్వానుగ్రహ కామ్యయా-55

అనుభూతిప్రకాశిక,

వింశాధ్యాయము.

శ్రుతి సమ్మతమైనవి యోగమనియు వివేకమనియు రెండు చెప్పబడినవి. ఒకానొకనికి యోగ్యము సాధ్యము కాదు. ఒకానొకనికి జ్ఞాననిశ్చయము సాధ్యముకాదు. కనుకనేఇట్లు రెండు ప్రకారములు అందరి ననుగ్రహించు కోర్కెతో చెప్పబడినవి. కాన భిన్నభిన్నము లైన రుచులు దృక్పథములుగల మానవులు తమకు నచ్చిన యోగము ను అనుసరించుటకు వీలగును. భగద్గీతలో ఇట్లు చెప్పబడినది.

శ్లో|| ధ్యానే నాత్మని పశ్యంతి కేచి దాత్మాని మాత్మానా

అన్యే సాంఖ్యేన యోగేన, కర్మయోగేన చాపరే.

భగవద్గీత 13-24

కొందరు ధ్యాననిష్ఠులై (ధ్యానయోగము) కొందరు సాంఖ్యయోగము చేత (జ్ఞానయోగము) కొందరు నిష్కామ యోగముచేత (కర్మయోగము)పరమాత్మను దర్శించుచున్నారు.

శ్లో|| అన్యే త్వేవ మజానన్తః శ్రుద్వాద్యేభ్య ఉపాసతే

తే పి చాతి తరంత్యేవ మృత్యుం శ్రుతి పరాయణాః

భగవద్గీత 13 -25

కొందరు గురువులవద్ద ఉపదేశము పొంది ఉపాసించుచున్నారు. (భక్తియోగము). ఇట్టివారును మృత్యువును తరించుచున్నారు. కాబట్టి పై నాలుగుమార్గములు ముక్తికి సాధనములే యని గీత ఆమోదించుచున్నది.

దేవీగీతలో కూడ మూడుయోగములు ముక్తి ప్రదములని తెలుపుచున్నది.

శ్లో|| మార్గాస్త్రయోస్తు విఖ్యాతా మోక్షప్రాప్తే నగాధిప

కర్మయోగోజ్ఞానయోగో భక్తియోగశ్చ సత్తమ||

దేవీగీత 6 -2

సాయుజ్యముక్తి లభించుటకు కర్మయోగము. భక్తియోగము, జ్ఞానయోగము, అను మూడుమార్గములు విధింపబడినవి. అందుజ్ఞాని యోగము సాధనాంతరాపేక్ష లేకయే స్వయముగా మోక్షము నొసగును. కర్మభక్తియోగములు చిత్తమును సంస్కరించి జ్ఞానమును కలిగించిమోక్షము నొసగును.

నాలుగు యోగములు సమాన ఫలదాయకములు

బ్రహ్మనిష్ఠ ఒకటైనప్పటికిని, అది సిద్ధించుటకు ఇంద్రియమనో నిగ్రహములు కలుగవలెను. (నాన్యఃపంధా ఆయనాయ విద్యతే) వానిని సాధించుటకు అనేక మార్గములు సూచించిబడినవి. గమ్యము బ్రహ్మనిష్ఠయే.

శ్లో|| ''సన్యాసః కర్మయోగశ్చ నిశ్ర్శేయస కరా ఉభౌ''

భగవద్గీత 5-2

సన్యాసము కర్మయోగము రెండును మోక్షప్రదములే.

శ్లో|| లోకేస్మిన్‌ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్తా మయానఘ

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌||

భగవద్గీత 3-3

నాచేత సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను రెండు విధముల నిష్ఠ చెప్పబడినది. ఇచట నిష్ఠ ఏకవచనము. ఇది రెండు విధములు లేక మార్గములు కలది. సృష్ట్యాదిని భగవంతుడు దీనిని తెలిపెను. ఆత్మానాత్మవిషయ వివేకము కలిగి విజ్ఞానులై వేదాంత విజ్ఞాన సువనిశ్చితార్థులైన సాంఖ్యులకు జ్ఞానయోగము, ఇతరులకు కర్మయోగము చెప్పబడినది. నైష్కర్మ్య సిద్ధిని పొందుటకు తొలుత కర్మను వదలరాదు. నిష్కామకర్మ చేయవలయును.

''To the discipline of knowledge whose characterestic is freedom from works, karmayoga is the means''.

శ్లో|| యోగినః కర్మకుర్వన్తి సంగం త్యక్త్వా త్మ శుద్ధయే''

భగవద్గీత 5-11

భక్తి, ధ్యాన, జ్ఞాన యోగులు చిత్తశుద్ధి కొరకు నిష్కామకర్మ చేయుదురు. చిత్తశుద్ధి వలన నైష్కర్మ్యము, బ్రహ్మనిష్ఠ, జ్ఞానము లభించును. కావున రెండుమార్గములు బ్రహ్మనిష్ఠను గూర్చున వగుచున్నవి.

అందులకే గీతలో ఇట్లు చెప్పబడినది.

శ్లో || సాంఖ్యయో గౌ పృథక్బాలాః ప్రవదంతి న పండితాః

ఏకమప్యా స్థితః సమ్య గుభయోర్విందతే ఫలమ్‌.

భగవద్గీత 5-4

కర్మయోగము వేరు సాంఖ్యయోగము వేరని అజ్ఞానులందరు. పండితులట్లనరు. పై రెండింటిలో ఒకదానిని బాగుగ ఆచరించినను రెండిటి ఫలము పొందుచున్నారు. అనగా నిష్కామ కర్మచేత చిత్త శుద్ధిజ్ఞాననిష్ఠకు యోగ్యత కలుగును. తరువాత నైష్కర్మ్యము జ్ఞానము మోక్షము కలుగును.

శ్లో || యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే.

భగవద్గీత 5-5

ఏ ముక్తిస్థానము జ్ఞానులచే పొందబడుచున్నదో అది కర్మ యోగుల చేతను పొందడుచున్నది.

పైవిధముగా జ్ఞానయోగము కర్మయోగము రెండునూ మోక్షప్రదములని సమస్వయుమ చేయబడినది. అట్లే భాగవతమున కపిలుడు తల్లి యుగు దేవహూతికి '' జ్ఞాన యోగంబును మదీయ భక్తి యోగంబును నొక్కటియ'' అని తెలిపి భక్తిజ్ఞానసమస్వయము జూపెను. ''భక్తియోగంబును నేని యోగంబుననేని పురుషుండు పరమాత్మను బొందు'' నను కపిలుని వాక్యము భక్తికిని ధ్యానమునకు సమస్వయముకుదుర్చి మోక్షప్రదములని సూచించెను. పై యోగము లలో దేనిని అనుసరించినను మోక్షము సిద్ధించునవి భాగవతము కూడ తెలుపుచున్నది.

శ్లో || యోగాస్త్రయో మయా ప్రోక్తా నృణాంశ్రేయొ విధిత్సయా

జ్ఞానం కర్మచ భక్తిశ్చ నోపాయో న్యోస్తి కుత్రచిత్‌||

భాగవతము 11-209-6

నరులకు మోక్షము గూర్చవలెనను కోరికతో నేను జ్ఞానము నిష్కామకర్మ భక్తి అను ఉపాయముల తెలిపితిని. ఇట్టి సమస్వయదృష్ఠి షట్దర్శనములయందును అగుపించదు.

కర్మభక్తి ధ్యాన జ్ఞానములు మార్గములా లేక యోగములా?

భగవద్గీతలో ప్రతి అధ్యాయముచివరను ''యోగశాస్త్రే'' అని వ్రాయబడి యున్నది. రమణగీత యందును ప్రతిఅధ్యయము చివర రను ''యోగశాస్త్రే'' అని చెప్పబడి యున్నది. భగద్గీత ను వేదోపనిషత్తుల సారమనియే గాక యోగశాస్త్రమని వచించుటకు కారణమేమి? గీతలోని యోగశబ్దము ఏ అర్ధముతో వాడబడినదో పరిశీలించినచో గీత యోగశాస్త్రమే యగుచున్నది.

ఎ) యోగ శబ్ధమునకు కర్మ పరముగా ప్రథమ నిర్వచనము:

యోగమనగా కలయిక అని అర్థము. చిత్తము ఈశ్వరుని యందు లగ్నమగుట అనవచ్చును. అద్వైతపరముగా పరమాత్మయందు ఐక్యము పొందుట యని చెప్పవచ్చును.

''సంయోగ యోగ ఇత్యుక్తో జీవాత్మపరమాత్మనో ఇతి'' అని యోగమునకు యాజ్ఞవల్క్యమహర్షి నిర్వచనము చెప్పెను. భగవద్గీతలో ప్రథమమున కర్మపరముగా శ్రీకృష్ణపరమాత్మ క్రింది నిర్వచనమును తెల్పెను

''యోగః కర్మసు కౌశలమ్‌''

అనగా కర్తృసంగ ఫలసంగములు లేక నిష్కామకర్మనాచరించుట చేత పుణ్యపాపములు లంటవు. ఇట్లు కర్మనాచరించు నేర్పునే కర్మయోగ మందురు. ఇట్టి నిష్కామ కర్మయోగమునకే గీత ప్రాధాన్యత నిచ్చినది.

శ్లో|| సన్యాసః కర్మయోగశ్చ నిశ్ర్శేయసకరా ఉభౌ

తయోస్తు కర్మ సన్యాసాత్‌ కర్మయోగో విశిష్యతే.

భగవద్గీత 5-2

కర్మసన్యాసము కర్మయోగము రెండును ముక్తిప్రదములే. కర్మసన్యాసముకంటె కర్మయోగమే గొప్పది. ఇంకను కర్మయోగమే ఉత్తమమని తన నిశ్చితాభిప్రాయమును శ్రీకృష్ణుడిట్లు తెలిపెను.

శ్లో || ఏ తాన్యపితుకర్మాణి సంగం త్యక్త్వా ఫలాదిచ

కర్తవ్యానీతి మే పార్థ! నిశ్చితం మత ముత్తమమ్‌||

భగవద్గీత 18-6

ఈ కర్మలను కర్తృసంగ ఫలసంగములు లేక కర్తవ్యములని ఆచరించుటయే నా నిశ్చితమైన అభిప్రాయము

కాని భాగవతము భక్తి లేని యడల '' జ్ఞానావాచా కర్మ కౌశలం బులు'' నిరర్థకములని తెలుపుచున్నది. భక్తితో కూడిన కర్మకే ప్రాధాన్యత నొసగి ఈశ్వరార్పణబుద్ధితో కర్మల నాచిరింపుమని తెలుపుచున్నది.

''కర్మలు సంసారహేతుకంబు లయ్యును ఈశ్వరార్పితం

బులై తమ్ము తామ చెరచుకొన నోపి యుండును''

భాగవతము

బి) యోగశబ్దమునకు ధ్యానయోగపరమైన ద్వితీయ నిర్వచనము:

భగవద్గీత యోగ శబ్ధార్థమున రెండవ పర్యాయము ''యోగ చిత్తవృత్తి నిరోధ ః'' అను పతంజలి నిర్వచనములోని అభిప్రాయముగా సూచించినది. ఇట్టి చిత్తవృత్తి నిరోధము సాధించుటకు భగవంతుడైన శ్రీకృష్ణుడు వేదములోని సంవర్గవిద్యను క్రింది శ్లోకములమున ఉపదేశించెను. మనస్సు నిగ్రహించుట సాధ్యము కాదని అర్జనుడు తెలుపగా, అభ్యాస వైరాగ్యముల చేత నిగ్రహింప వీలగునని తెలిపి అభ్యాస విధానము నిట్లు సూచించెను.

శ్లో|| స్పర్శాన్‌ కృత్వా బహిర్భాహ్యాన్‌ చక్షుశ్చై వాంతరేభృవోః

ప్రాణాపానౌ సమేకృత్వా నాసాభ్యాంతర చారిణౌ||

భగద్గీత 5-27

ప్రాణ గత్యాగతి ప్రత్యవేక్షణము చేత మనో నిగ్రహము కుంభకము సాధింపవచ్చునని ఈ మార్గము సూచించుచున్నది. ఇదియే ధ్యానయోగము. కుంభకప్రాణాయామాదులు కూడ ధ్యానయోగ మున చెప్పబడెను. అందులకే గీతలో

శ్లో || తపస్విభ్యో ధికో యోగీ జ్ఞానీభ్యో పి మతోదికః

కర్మిభ్య శ్చాదికో యోగీ తస్మాత్‌ యోగీ భవార్జనః

భగవద్గీత 6-46

యోగియైనవాడు తపస్సుచేసిన వారికంటెను, శాస్త్రార్థపాండిత్వము గలవారికంటెను, కర్మనిష్ఠులకంటెను అధికుడు. అందువలన నీవు యోగివికమ్మని శ్రీకృష్ణుడుర్జుని కోరెను.

ఈ సందర్భమున పతంజలి యోగమార్గమున శ్రీకృష్ణుడు సమర్థించి నప్పటికిని యోగి భగవంతుని యం దంతఃకరణము కలవాడుగా నుండవలెననికూడ తెలిపెను.

శ్లో|| యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా

శ్రాద్ధావాన్‌ లభ##తే యో మాం సమేయుక్తతమో మతః||

భగవద్గీత 6-47

కర్మభక్తి ధ్యాన జ్ఞాన యోగులందరిలో నాయందంతఃకరణము కలవాడగుచు నన్నెవ్వడు సేవించుచున్నాడో అతడు యోగిశ్రేష్ఠుడని నామతము. అయినను భాగవతమున కపిలుడు మనో నిగ్రహోపాయ మునకు సంవర్గవిద్యకు బదులుగా అవయవ యోగము సూచించెను.

సాంఖ్యవిచార మార్గమును గ్రహింపజాలని తల్లికి అవయవ యోగము నిట్లు తెలిపెను.

మ|| విమలంబై పరిశుద్ధమై తగు మనోవిజ్ఞాన తత్త్వప్రబో

ధమతిన్‌ నిల్పి, తదీయమూర్తి విభవ ధ్యానంబు గావించి, చి

త్తము సర్వాంగ విమర్శన క్రియలకున్‌ దార్కొల్పి, ప్రత్యంగమున్‌

సుమహాధ్యానము సేయగావలయు పో శుద్దాంతరంగంబునన్‌.

భాగవతము 3-927

భాగవతము యోగజనితి జ్ఞానమున్నప్పటికిని భక్తి లేనియెడల శ్రీహరిని దర్శింపజాలడని తెలుపుచున్నది. బ్రహ్మదేవుడు శ్రీహరి నాభికమలము నందుద్భవించి యమనియమాది అష్టాంగ యోగముల నభ్యసించెను.

''అబ్జ పీఠమునందు సాష్టాంగ యోగక్రియానురక్తి

బవను బంధించి మహిత తపస్సమాధి

నుండి శతవత్సరములు సనుచుండ నంత'' భాగవతము 3-282

అనగా బ్రహ్మదేవుడు యమనియమాది అష్టాంగ యోగములనభ్యసించి కుంభక సమాధియందు నూరు సంవత్సరములు గడపెను.

అ|| అట్టి యోగజనిత మైన విజ్ఞానంబు

గలిగి యుండి దాన గమలనయను

గానలేక, హృదయ కర్ణికయందు

నున్నవాని దన్ను గన్నవాని, భాగవతము 3-283

మ|| ''కనియెన్‌ నిశ్చల భక్తియోగ మహిమన్‌''

భాగవతము 5-284

ఇట్లు అష్టాంగ యోగజనిత జ్ఞానమున్నను తన హృదయ పద్మమున నున్న తన తండ్రియైన నారాయణుని కనగొనజాల డయ్యెను. కాని నిశ్చ భక్తి యోగ మవలంబించిబ్రహ్మదేవుడు శ్రీహరి సాక్షాత్కారమును బొంద గలిగెను. అనాగా భక్తి లేని ప్రాణాయామాది యోగములు నిరర్థకములని భాగవతమతము, అష్టాంగ యోగమువలన ఆణిమాది అష్టసిద్ధులు మాత్రమే లభించును. సిద్ధమైయుండు వస్తువు నెఱుగుటయేసిద్ధి. ఇతరసిద్ధులు స్వప్నసిద్ధులే. అందులకే భాగవతమున

చ|| యమనియమాది యోగముల నాత్మ నియంత్రితమయ్యుకామరో

షముల ప్రచోదితంబయగు; శాంతి వహింపదు విష్ణు సేవచే

క్రమమున శాంతి గైకొనిన కైవడి.

భాగవతము 1-132

అని వ్యాసునకు నారదుడు తన అనుభవము తెలిపెను. సమాధి యందున్నంతకాలము మాత్రమే ఇంద్రియ మనంబు లడగియుండునని దీని భావము.

యోగ శబ్దమునకు జ్ఞానపరముగా తృతీయ నిర్వచనము:

''సమత్వం యోగ ఉచ్యతే'' భగవద్గీత 2-48

అని మూడవ పర్యాయము యోగశబ్దము గీతలో నిర్వచించబడినది. సమత్వమనగా సుఖదుఃఖముల యందు సమబుద్ధి కలిగియుండుట.

శ్లో|| సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజ¸°

భగవద్గీత 2-38

సుఖదుఃఖములను లాభాలాభములను జయాపజయములను సమముగా భావించుము.

శ్లో|| సిద్ధ్య సిద్ధ్యోః నమో భూత్వా గీత 2-48

కార్యము సిద్ధించినపుడును, ప్రతికూలించినపుడును సమబుద్ధితో నుండుము.

శ్లో|| దుఃఖే ష్వనుద్విగ్నమానాః సుఖేషు విగత స్పృహః

గీత 2-56

దుఃఖము కలిగినపుడు కలతపడని మనస్సు గలవాడు, సుఖముల యందాశ##లేనివాడు స్థితప్రజ్ఞుడు,

శ్లో|| ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున

సుఖంవా యదివా దుఃఖం సయోగీ పరమో మతః

భగవద్గీత 6-32

ఆర్జునా! ఎవడు సర్వభూత సుఖదుఃఖములను తన సుఖదుఃఖములుగా దలచునో అట్టివాడు జ్ఞానులలో నుత్తముడు.

ఒకనిని జ్ఞానిగా గుర్తించుట ఎట్లని వాశిష్ఠగణపతిముని రమణ మహర్షినిప్రశ్నించెను.

కం|| ఏమి గుఱుతుచే గోవిదు

లీ మహి జ్ఞానిగను నొకని నెఱుగ వలంతుల్‌?

-రమణగీత

దానికి బదులుగా రమణమహర్షి సమాధానమున పరికింపుడు.

క|| నానాభూత సమత్వము

జ్ఞానము నూహింప గుఱుతు గానగు. రమణ గీత

నానాభూత సమత్వము గలవానినిజ్ఞానిగా గుర్తింపవచ్చును.

శో|| సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర నమదర్శనః

భగవద్గీత 6-29

యోగయుక్తు డంతటను సమానమగు ఆత్మ దర్శనముగల వాడగుచు, తాను సర్వభూతములందును, సర్వభూతములు తనయందునున్నటులు అనుభవముచే దెలిసికొనుచున్నాడు.

శ్లో|| యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యంతి

తస్యాహం నప్రణస్యామి, సచమే నప్రణశ్యతి

భగవద్గీత 6-30

ఎవడు సమస్త భూతములయందు నన్నును, నాయందు సమస్తభూతములను జూచుచున్నాడో అతనికి నేను. నాకు నతడు ప్రత్యక్షులుగా నుందుము.

అందులకే భాగవతమున ''సమత వర్తించు నప్పుణ్యతముడు ఘనుడు'' అని చెప్పబడినది ప్రహ్లాదుడు ''తనయందు నఖిలభూతములందు నొక భంగి సమాహితత్త్వంబున బరగువాడు''

శ్లో|| విద్యా వినయ సంపన్నే బ్రహ్మణ గవిహస్తి ని

శునచైవ శ్వపాకేచ పండితా స్పమదర్శనః

భగవద్గీత 5-18

విద్యావినయ సంపన్నుడగు బ్రహ్మణుని యందును, గోవునందును, ఏనుగ యందును, కుక్క యందును, చండాలుని యందును, తమ ఆత్మరూపమగు బ్రహ్మమునే జూతురు. ఎవడు సమబుద్ధి (సమదర్శనము, సమత, సమత్వము) కలిగియుండునో వాడు ఇతరులను ''ఆత్మకుం సములుగా జింతించు''. ఇట్టి సమబుద్ధి ఏర్పడుటకు, జ్ఞానము సిద్ధించుటకు దారిద్య్రమవసరమని పోతన భావించెను.

é శా|| సంపన్నుండొరు గానలేడు, తనువున్‌ సంసారమున్‌ నమ్మిహిం

సింపం జూచు దరిద్రు డెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హిం

సింపం డన్యుల, నాత్మకున్‌ సములుగా జింతించు, నట్లౌట త

త్సంపన్నాంధుల కంజనంబగు సుమీ! దారిద్య్రమూహంపగన్‌

భాగవతము 10-394

ధనవంతుడు సంసారమును నమ్మి ఇతరులను హింసించును. దరిద్రుడు కష్టపరంపరలకు గురియై ఇతరులను ఆత్మకు సములుగా గుర్తించును. కాబట్టి ధనమదాంధులకు దారిద్య్రమే కన్నుల తెరపించు అంజనము. భాగవతమున భగవంతుడు కూడ

సీ|| ఎవ్వని కరుణింప నిచ్చగింతును వాని

యఖిల విత్తంబు నే నపహరింతు

భాగవతము 8-661

అనితెలిపెను.

ఈ సమబుద్ధియే బుద్ధియోగము. సమబుద్ధితో కూడిన సాంఖ్యజ్ఞానము లేక ఆత్మానాత్మ విచారము జ్ఞానయోగముగా మారును. సర్వ భూతాంతరస్థమగు ఆత్మయొక్క అనుభూతి కలుగును.

శ్లో|| శ్రుతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా

సమాధా వచాల బుద్ధిస్తదా యోగ మవాపప్స్యసి ||

భగవద్గీత 2-53

వేదాంత శ్రవణముచేత చలనము బొందిన నీబుద్ధి ఎప్పుడు సమాధియందు నిశ్చలముగా నిలచునో అప్పుడు జ్ఞానయోగము తద్వారా దుఃఖ నివృత్తి ఆనందప్రాప్తి బొందగలవు.

యోగ శబ్దమునకు భక్తిపరముగ చతుర్థ నిర్వచనము

గీతలో 12వ అధ్యాయము భక్తియోగమునందు అనన్యమైన సాత్విక, భక్తి యోగము ప్రతిపాదింపబడినది. ఆ అధ్యాయములో నిర్గుణోపాసనకంటె సగుణోపాసన సులభమని గీత తెలపినది.

శ్లో|| క్లేశో7ధిక తరస్తేషా మవ్యక్తాసక్త చేతసాం

అవ్యక్తాహి గతి ర్దుఃఖం దేహవద్భి రవాప్యతే.

భగవద్గీత 12-5

నిర్గుణోపాసనకు సగుణోపాసనకంటె కష్టమధికము. దేహాభి మానము గల వారలకు హెచ్చుకష్టము కలుగకయే పరబ్రహ్మనిష్ఠ సిద్ధింపదు.

శ్రీకృష్ణుడు తనభక్తుడు తప్పక తన్ను పొందగలడని ప్రమాణ పూర్వకముగా రెండు పర్యాయములు చెప్పెను.

శ్లో|| మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు

మామేవైష్యసి యుక్త్యైవ మాత్మానం మత్పరాయణః.

గీత 9-34

శ్లో|| మన్మనాభవ మద్భుక్తో మద్యాజీ మాం నమస్కురు

మామేవైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియా7సి మే ||

గీత 18-65é

నాయందు చిత్త ముంచుము. నాయందు భక్తి కలిగియుండుము. నన్నె సెవింపుము. నాకే నమస్కరింపుము. నన్ను పొందగలవు. ఇష్టుడవగు నీకు సత్యప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.

గీతలో భక్తికి ప్రత్యేకస్థానము ఇచ్చినట్లు కాన్పించదు. భక్తి చేత జ్ఞాన మేర్పడునునని సూచింపబడును.

''సత్వాత్‌ సంజాయతే జ్ఞానం, భక్త్యా జ్ఞానం ప్రజాయతే''

-గీత

కాని భాగవతమున నాలుగుయోగములలో భక్తికే ప్రాధాన్యత ఇవ్వబడినది. ''పరమ ప్రేమరూపా'' అను నారద భక్తి సూత్రములలో నిర్వచింపబడిన పరాభక్తి భాగవతమున అనన్య అభేద ఆత్యంతిక భక్తి యోగముగా మారినది.

1) భక్తిలేక భవదీయ జ్ఞానంబులేదు. - ప్రహ్లాదుడు

2) మదీయ భక్తియోగంబును జ్ఞానయోగంబును ఒక్కటియ.

3) భక్తిలేక జ్ఞాన వాచాకర్మ కౌశలంబులు నిరర్థకంబులు''

-----కపిలుడు

పై భాగవత వాక్యములు భక్తికి అగ్రస్థానము నిచ్చుచున్నవి. ''భక్తియోగంబున నేని యోగంబున నేని'' ముక్తి లభించునను కపిలుని వాక్యము భక్తి మోక్షప్రదమైనప్రత్యేక మార్గమని సూచించుచున్నది. ఇంకను భాగవతము ముందంజవేసి భాగవతులు భక్తియోగమును దప్పఇతర ముక్తిదములైన కర్మ, ధ్యాన, జ్ఞానయోగముల నవలంబింపరని తెలుపుచున్నది.

క|| యుక్తిందలప భవద్వ్యతి

రిక్తములైనట్టి ఇతర దృఢ కర్మంబుల్‌

ముక్తి దములైన నీపద

భక్తులు తత్కర్మములను బాటింప రిలన్‌

భాగవతము 3-547

అందులకే భాగవతమున భగవంతుడు భక్తి యోగము నెక్కువగా ఆదరించు నని కూడ చెప్పబడినది.

మ|| క్రతు దా నోగ్ర తప స్సమాధి జపసత్కర్మాగ్ని హోత్రాఖిల

వ్రత చర్యాదుల నాదరింప, వఖిల వ్యాపార పారాయణ

స్థితి నొప్పారెడ్డి నీపదాబ్జ యుగళీ సేవాభిపూజాసమ

ర్పిత ధర్ముండగువాని భంగి, నసురారీ! దేవ చూడామణీ!

భాగవతము 3-301

యోగ శబ్దార్థము :

యోగమనగా కలయిక ఎవరితో కలయిక ? భగవంతునితో అని భావము. భగవంతునితో సంయోగము బ్రహ్మాంనంద ప్రదము. అతనితో వియోగము సంసార తాపత్రయ దుఃఖకరము. శ్రీరమణ మహర్షి ఇట్లు తెలిపెను.

''యోగమనగా నేను బ్రహ్మమునుండి వేరుకాదని తలచుటయే. కర్మభక్తి ధ్యాన జ్ఞాన యోగములు అధికారమును బట్టి చెప్పబడినవి, నీవు ఆత్మకన్న వేరు కానప్పుడు దానిలో ఐక్యముచెందుట ఎట్లు సాధ్యము? నీవునీ వగుటయే యోగము'' ఇది జీవన్ముక్తికి మార్గము.

శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇట్లు తెలిపెను.

''జ్ఞాతుం ద్రష్టుంచ తత్త్వేన ప్రవేష్టుంచ పరంతప!''

నన్ను జూచుటకుగాని తెలిసికొనుటకుగాని నాయందుప్రవేశించుటకుగాని అనుటచే సామీప్య, సారూప్య, సాయుజ్యముక్తులు చెప్పబడినవి. ఇందులో క్రమ ముక్తి మార్గము చెప్పబడినది. మొదట చెప్పినది జ్ఞానయోగము. రెండవది భక్తి యోగము.

చెప్పవచ్చిన దేమనగా వేదములయందు, దర్శనములయందు చెప్పబడిన కర్మభక్తి ధ్యాన జ్ఞానమార్గములు భగవద్గీత భాగవతములలో తగినట్లు సవరింపబడుటచేత అవి ముక్తి మార్గములైనవి. వానిని మార్గములనక కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగములని నామకరణము చేయబడినది. కాన యోగశబ్దమునకు ముక్తి మార్గమని అర్థము చెప్పవచ్చును. అందువలన ముక్తి ప్రదమైన భగవద్గీత యోగశాస్త్రమైనది.

éఎట్టివాడు భగవంతుని పొందును:

పై యోగములు నన్నింటిని సమన్వయ దృష్టితో గీత ఒక శ్లోకమున పొందుపరచుచున్నది చూడుడు. గీతలోని 11-55 శ్లోకమును గూర్చి భాష్యకారు లేమి తెలిపిరో గమనింపుడు.

''సర్వస్యగీతాశాస్త్రస్య సారభూతోర్థ నిఃశ్రేయ సార్థో7నుష్ఠేయత్వేన సముచ్చిత్యోచ్యతే''

గీతశాస్త్రముయొక్క సమగ్రమైన అర్థమును ఈ శ్లోకములో తెలిపి కర్తవ్యమును సూచించెను.

1) మత్కర్మకృత్‌ = నా కర్మలను చేయువాడు (కర్మయోగము)

భగవంతుని గూర్చి చేసిన కర్మము భగవంతుని పొందుటకే యగును.

2) మత్పరమః=నాయందు తత్పరుడైనవాడు (ధ్యానయోగము)

3) మద్భక్తః=నా భక్తుడు (భక్తియోగము)

4) సంగవర్జితః=ఇతరమునం దాసక్తి (ఆనాత్మ యందు) లేని వాడు (జ్ఞానయోగము)

నిర్వైరస్సర్వ భూతేషు = భూతయ గలవాడు (జ్ఞాని లక్షణము సమత్వము)

పై లక్షణము గలవాడు నన్నే పొందునని లేదా పై యోగముల ననుసరించువాడు నన్నే పొందునని 11-54 శ్లోకమున గీతలో కృష్ణుడు తెలిపెను. అనగా కర్మభక్తి ధ్యాన జ్ఞానయోగములు భగవత్పరమైనప్పుడు (మద్గతే నాంతరాత్మనా = భగవంతునియందు లగ్నమైన మనస్సుతో అనుసరించినప్పుడు) ముక్తిదము లగునని సారాశంము. ప్రతియోగమునకు ధ్యేయము, సాధ్యము, గమ్యము, భగవంతుడే కావలెను. ''ఆత్మావా7రే మంతవ్యోద్రష్టవ్యో నిధిధాసితవ్యః'' అనగా ఆత్మయే చూడదగినది, ధ్యానింపదగినది అని వేదములో నిర్గుణ పరమాత్మపరముగ చెప్పినట్లే ''కృష్ణ పరమాత్మావా7రే మంతవ్యోద్రష్టవ్యో నిధి ధ్యాసితవ్యః'' అని చెప్పినప్పుడు సగుణ పరమగును కదా ?

పైవిధముగా భగవద్గీత భాగవతములు కర్మభక్తి ధ్యాన జ్ఞానమార్గములను ముక్తి ప్రదములైన యోగములుగా సవరించి సమన్వయ పరచినవి. క్లుప్తముగా వాని సారాంశము పొందుపరతును.

1) కర్మయోగము:- కామ్యబుద్ధితో వైదిక కర్మాచరణము వలన స్వర్గాది లోకప్రాప్తి కలుగును. కాని కర్మాచరణము మోక్షప్రాప్తికి సాధనము కావలసినప్పుడు కర్మలను నిష్కామముగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలయును. అప్పుడు కర్మమార్గము కర్మ యోగమగును.

2) ధ్యానయోగము:- ధ్యానమార్గమున మనోనిగ్రహము పొందుటకై చేయబడు హఠయోగాదులు అణిమాద్యష్ట సిద్ధులు గూర్చునుగాని మోక్షప్రదమలు గావు. ధ్యానమార్గము మోక్షప్రదమగు ధ్యానయోగ మగుటకు యోగి భగవంతునియం దంతఃకరణము కలవాడు కావలెను.

3) భక్తియోగము:- భక్తి మార్గము తామసరాజస గుణములతో కూడియున్నప్పుడు సంసార మగ్నులను చేయును. ఆది మోక్ష ప్రదముకాదు. ఈశ్వరార్పణబుద్ధితో కర్మల నాచరించి భగవత్సేవతప్ప ఇతరము నాచరింపక, అనన్యము, అభేదము, ఆత్యంతికమగు భక్తిని పాటించినచో అది భక్తియోగమై ముక్తి ప్రద మగును.

4) జ్ఞానయోగము:- జ్ఞానము కేవల శాస్త్ర జన్యమైనప్పుడు అది ఆత్మానాత్మ విచార రూపమగు సాంఖ్య మగును. అది అనుభవజ్ఞానమైనప్పుడు ఆత్మ సాక్షాత్కారము కలుగజేయు జ్ఞానమోగమై ముక్తి ప్రద మగును. పుస్తకజస్య ఆత్మజ్ఞానము సాంఖ్యము. అనుభవమున అది విజ్ఞానమగును. ''జ్ఞాన విజ్ఞాన సహితం యం జ్ఞాత్వామోక్షసే7శుభాత్‌'' భగవద్గీత.

భగవత్ప్రీతికరములైన కర్మలను చేసి, భగవంతుని యందు మనస్సునిలిపి, భగవంతునీయందు ప్రేమ గలిగి ఆత్మానాత్మవివేకము కలిగియుండువాడు, అనగా నాలుగు యోగములను భగవంతునియందు సమన్వయ బుద్ధితోను సామ్యబుద్ధితోను (బుద్ధియోగము) అనుసరించు వాడు మోక్షమును పొందును. పై యోగములన్నియు ఒకదానితో నొకటి ముడిబడి, ఒకదానికొకటి తోడై ముక్తికి దారి తీయుననుటయే సమన్వయ బుద్ధితో యోగశబ్దార్థమును గ్రహించుట యని నిర్ణయింప వచ్చును. నిష్కామకర్మతో ధ్యానమును ఈశ్వరార్పణబుద్ధితో భక్తిని సాత్వికభక్తితో జ్ఞానమును తుదకు మోక్షమును పొందవచ్చును.

భగవద్గీత భాగవతముల ముక్తిమార్గపద్దతి ననుసరించువాడు క్రింది ప్రతిజ్ఞలు చేయవలయును. నిత్యజీవితమున అనుష్ఠించవలెను. అట్టివాడు నిస్సంశయముగ ముక్తుడగును.

భగవద్గీత భాగవతముల సందేశము

మానవుని నిత్య జీవన విధానము

శో|| మత్కర్మకృరత్‌ మత్పరమః

మద్భక్తః సంగ వర్జితః

నిర్వైరస్సర్వ భూతేషు

యః సమామేతి పాండవ! -భగవద్గీత

ప్రమాణ స్వీకారము

1) కర్మయోగము:- నేను భగవత్ప్రీతికరములైన పనులగు యజ్ఞదాన తపః కర్మలను - అనగా దేవతార్చన, పరోపకారము. దేహ మాలిన్యము మనోమాలిన్యము తొలగించు జపాదులు అను కర్మలను కర్తృసంగ ఫలసంగమును వదలి, నా ఇంద్రియ మనస్సులకుతృప్తిని గుర్చుటకొఱకుగాక భగవత్ప్రీతికరముగ భగవదర్పణబుద్ధితో ఆచరించెదను.

2) ధ్యానయోగము:- భౌతిక సుఖములను స్వర్గభోగములను ఆశింపక అణిమాద్యష్టసిద్దులను గోరక భగవంతునియందు లగ్నమైన మమనస్సునుకలవాడనై ధ్యానింతును.

3) భక్తియోగము:- కోరికలను కోరక భగవంతునియందు పరమ ప్రేమ కలిగి అభేదము అనన్యము ఆత్యంతికము అగు భక్తితో భగ వంతుని భజింతును.

4) జానయోగము:- ''వాసుదేవ స్సర్వమితి'' అను భావనతో సంసార విషయములయందు సంగమునువదలి సమబుద్ధితో ఆనాత్మను నిరసించి పరమాత్మను అనుసంధానము చేయుదును.

పై నాలుగు యోగములను నా నిత్య జీవిత విధానమున అను సరింతునని ప్రమాణ స్వీకారము చేయుచున్నాను.

పరమ భాగవతులు పాటించు పథమిది

ఈ పథమున యోగి ఏ గెనేని.

మగిడిరాడు వాడు, మఱి సంశయములేదు,

కల్ప శతములైన, కౌరవేంద్ర!

-భాగవతము 2-33

Sri Bhagavadgeetha Madanam-1    Chapters